యాంటీ బయోటిక్స్‌పై డాక్టర్లకు కేంద్రం కీలక అడ్వైజరీ
దిశ, నేషనల్ బ్యూరో : యాంటీ బయోటిక్స్, యాంటీ మైక్రోబయల్ మందులను రోగులకు సూచించే అంశంపై డాక్టర్లకు కేంద్ర సర్కారు కీలక సూచనలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : యాంటీ బయోటిక్స్, యాంటీ మైక్రోబయల్ మందులను రోగులకు సూచించే అంశంపై డాక్టర్లకు కేంద్ర సర్కారు కీలక సూచనలు చేసింది. వాటిని రోగులకు సూచించేటప్పుడు కచ్చితమైన కారణాన్ని తప్పనిసరిగా పేర్కొనాలంటూ వైద్యులకు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఒక అడ్వైజరీని జారీ చేసింది. యాంటీ మైక్రోబయల్స్‌ను అతిగా వాడటం వల్ల యాంటీ మైక్రోబయల్స్ రెసిస్టెంట్(ఏఎంఆర్) వ్యాధికారకాలు, సూక్ష్మక్రిములు ఏర్పడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ అడ్వైజరీని విడుదల చేశామని కేంద్రం పేర్కొంది. 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ విపత్తు వల్ల 12.7 లక్షల మరణాలు, డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల వల్ల 49.50 లక్షల మరణాలు సంభవించాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులు కూడా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు లేకుండా నేరుగా యాంటీ బయోటిక్స్ అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం కోరింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 ప్రకారం.. యాంటీ బయోటిక్స్ అనేవి షెడ్యూల్ హెచ్ కింద పేర్కొన్న ఔషధాల జాబితాలో ఉన్నాయి. వీటిని కనీసం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (RMP) ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే రిటైల్‌గా విక్రయించాలి.
ఏఎంఆర్‌తో 2050 నాటికి కోటి మరణాలు
చాలామంది యాంటీ బయోటిక్స్, యాంటీ మైక్రోబయల్ మందులను విచ్చలవిడిగా వాడేస్తుంటారు. కొందరు డాక్టర్లు కూడా వీటిని ఎడాపెడా ప్రిస్క్రిప్షన్లలో రాసేస్తుంటారు. వీటి వల్ల యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అనే నిశ్శబ్ద మహమ్మారి సంభవిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక పేర్కొంది. ఏఎంఆర్ వల్ల 2050 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా కోటి మంది మరణాలు సంభవించే ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. యాంటీ బయోటిక్స్, యాంటీ మైక్రోబయల్స్‌ను అతిగా వాడటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ గాడి తప్పుతుందని తెలిపింది. ఆ మందులను తట్టుకోగలిగే సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు చికిత్స కష్టతరమవుతోందని.. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో పాటు మరణాల ముప్పు పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.