ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసే టైం ఇంకా రాలేదు.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని వెలువడుతున్న కథనాలపై ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్, సీఎం స్టాలిన్ స్పందించారు.

Update: 2024-08-05 13:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని వెలువడుతున్న కథనాలపై ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్, సీఎం స్టాలిన్ స్పందించారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయడానికి ఇంకా టైం రాలేదని తెలిపారు. అయితే పార్టీలో ఈ డిమాండ్ బలంగా వినపడుతోందన్నారు. కానీ నిర్ణయం తీసుకోవడానికి అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓ అధికారిక కార్యక్రమం సందర్భంగా స్టాలిన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, దానిని పరిగణనలోకి తీసుకుంటారా అని పశ్నించగా ఆయన స్పందించారు. పార్టీ శ్రేణుల నుంచి ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదన ఉందని, కానీ దానికి ఇంకా సమయం ఉందని వెల్లడించారు. కాగా, సీఎం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News