Ashok Gehlot: హైకోర్టుకు రాజస్థాన్ సీఎం క్షమాపణలు..
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్ర హైకోర్టుకు భేషరతుగా క్షమాపణలు తెలిపారు.
జైపూర్: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్ర హైకోర్టుకు భేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఆగస్టు 30న సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, ‘న్యాయవ్యవస్థలో అవినీతి పెరుగుతోంది. కొందరు న్యాయమూర్తులు లాయర్లు రాసిచ్చిన తీర్పునే చదువుతారని విన్నాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దుమారం రేగిన ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఒక రోజు స్ట్రైక్ చేపట్టారు. కేసు నమోదు చేశారు.
సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది. దీనిపై గతనెల 5నుంచి విచారణ జరగుతోంది. ఈ క్రమంలోనే ధర్మాసనం ఆదేశం మేరకు సీఎం గెహ్లాట్ తన భేషరతు క్షమాపణలను అఫిడవిట్ ద్వారా సమర్పించారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, బాధకలిగించి ఉంటే క్షమించాలని కోరారు. దీన్ని స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.