Cloudburst: సిమ్లాలో కుండపోత వర్షం.. 20 మంది గల్లంతు

సిమ్లాలో ఒక్కసారిగా కురిసిన కుండపోత(క్లౌడ్‌ బర్ట్స్‌) వర్షానికి రాంపూర్‌లో 20 మంది గల్లంతయ్యారు

Update: 2024-08-01 05:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సిమ్లాలో ఒక్కసారిగా కురిసిన కుండపోత(క్లౌడ్‌ బర్ట్స్‌) వర్షానికి రాంపూర్‌లో 20 మంది గల్లంతయ్యారు. గురువారం తెల్లవారుజామున సమేజ్ ఖాడ్ వద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో మేఘాల్లోని నీరు ఒక్కసారిగా కుంభవృష్టిగా కురవడంతో ఆ ఏరియాలో దాదాపు 20 మంది అదృశ్యమైనట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. అలాగే, ప్రాజెక్ట్ కూడా కొంత దెబ్బతిందని డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు.

దీంతో విపత్తు ప్రతిస్పందన బృందం, జిల్లా పోలీసు చీఫ్ పలువురు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, పోలీసులు, హోంగార్డుల బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. కుండపోత వర్షానికి రోడ్డు కనెక్టివిటీ దెబ్బతింది.

సిమ్లాకు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో కూడా క్లౌడ్‌ బర్ట్స్‌ సంభవించింది. ఒకరు మరణించగా, తొమ్మిది మంది వ్యక్తులు తప్పిపోయినట్లు సమాచారం. మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగన్ పేర్కొన్న దాని ప్రకారం, ముహల్ తేరాంగ్ సమీపంలోని రాజ్‌బాన్ గ్రామంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అన్ని విద్యా సంస్థలు, వృత్తి శిక్షణా కేంద్రాలను మూసివేశారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌లో కూడా కుంభవృష్టి కారణంగా గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ మార్గంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెహ్రీ గర్వాల్ జిల్లా జఖాన్యాలీలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News