పొరుగు దేశాలపై చైనా ప్రభావం గురించి భయపడేది లేదు: జైశంకర్
ఏ దేశానికైనా పొరుగున ఉన్న దేశాలతో సమస్యలు ఉంటాయి, కానీ ఎప్పటికైనా పొరుగువారితో సత్సంబంధాలు అవసరమవుతాయని..
దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు పొరుగున్న ఉన్న దేశాలను ప్రభావితం చేయాలని చైనా ప్రయత్నిస్తోందని, ఇటువంటి రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఏ దేశానికైనా పొరుగున ఉన్న దేశాలతో సమస్యలు ఉంటాయి, కానీ ఎప్పటికైనా పొరుగువారితో సత్సంబంధాలు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్న ఆయన, మాల్దీవుల్లో పెరుగుతున్న చైనా ప్రభావం గురించి సమస్యలు ఉన్నాయి, అయితే దీన్ని భారత దౌత్యపరమైన వైఫల్యంగా పేర్కొనడం తప్పని జైశంకర్ స్పష్టం చేశారు. 'చైనా కూడా పొరుగు దేశమేనని, రాజకీయ బలం కోసం ఆయా దేశాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. అలాగని, చైనాను చూసి భయపడాల్సిన అవసరంలేదని భావిస్తున్నాను. ప్రపంచ రాజకీయాల్లో ఇది సాధారణమే. ఇందులో చైనా తన వంతు ప్రయత్నం చేసినప్పుడు, భారత్ చేయగలిగినంత చేస్తుందని' మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధాన ఆర్థికవ్యవస్థగా, చైనా తన వనరులతో పొరుగు దేశాలను ప్రభావితం చేయవచ్చు. కానీ మనవంతు ప్రయత్నం చేస్తూ పోటీని ఆహ్వానించాలని జైశంకర్ వెల్లడించారు. పొరుగు దేశాలకు సాయం అందించడంలో భారత్‌కు ట్రాక్ రికార్డ్ ఉంది. శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు భారత ప్రభుత్వమే ఆదుకుందని ఆయన ప్రస్తావించారు.