China: ద్వైపాక్షిక సహకారం మూడో పక్షానికి హాని కలిగించొద్దు.. మోడీ ట్రంప్ భేటీపై చైనా స్పందన
మోడీ, ట్రంప్ భేటీపై చైనా స్పందించింది. ఇద్దరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సహకారం మూడో దేశ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భేటీపై చైనా స్పందించింది. ఇద్దరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సహకారం మూడో దేశ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని తెలిపింది. ఆసియా-పసిఫిక్ శాంతియుత అభివృద్ధికి కేంద్రమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. దేశాల మధ్య సంబంధాలు, సహకారం చైనా సమస్యగా మారకూడదని ఇతరుల ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉండొద్దని తెలిపారు. ఒప్పందాలు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు అనుకూలంగా ఉండాలని చైనా విశ్వసిస్తుందన్నారు. ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేయడానికి కలిసికట్టుగా పనిచేయడం వల్ల భద్రత లభించదని, ఆసియా-పసిఫిక్‌తో పాటు మొత్తం ప్రపంచాన్ని శాంతియుతంగా, స్థిరంగా ఉంచలేమన్నారు. కాగా, మోడీ ట్రంప్ భేటీలో భాగంగా అమెరికా, భారత్ మధ్య సన్నిహిత భాగస్వామ్యం సహా పలు అంశాలపై చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం శాంతికి కేంద్ర బిందువు అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే చైనా స్పందించింది.