MHA advisory: ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నారా? సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త..!
సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు వారి కన్ను ఆధ్యాత్మిక పర్యాటకంపై పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు వారి కన్ను ఆధ్యాత్మిక పర్యాటకంపై పడింది. నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపుతున్నారు. దీంతో, కేంద్రం అలెర్ట్ అయ్యింది. ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పౌరులను అప్రమత్తం చేస్తూ అడ్వైజరీ జారీ చేసింది. స్పాన్సర్డ్ పేరుతో ఉండే లింకులు, ఫేస్‌బుక్, వాట్సప్‌లో వచ్చే లింక్స్ ని క్లిక్ చేసే ముందు అవి అసలైనావా? నకిలీవా? ధ్రువీకరించుకోవాలని సూచించింది. వీలైనంతవరకు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఆశ్రయించాలంది. లేదంటే నమ్మదగిన ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాలని కోరింది. ఇలాంటి ఘటనలు ఏవైనా పౌరుల దృష్టికి వస్తే cybercrime.gov.in పోర్టల్‌లో లేదా 1930కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించింది. ఇలాంటి మోసాలు జరగకుండా కేంద్రం కూడా తమవంతుగా గూగుల్, వాట్సప్, ఫేస్‌బుక్‌తో సమన్వయం చేసుకొని చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
నకిలీ వెబ్ సైట్లు
పర్యాటకానికి సంబంధించి సేవలందిస్తామన్న పేరుతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడం, సోషల్‌మీడియా ప్రొఫైళ్లు, వాట్సప్ అకౌంట్ల నుంచి సందేశాలు పంపుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా కేదార్‌నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్‌లు, ఛార్‌దామ్ యాత్రికులకు అతిథిగృహాలు, హోటల్ బుకింగ్స్, ఆన్‌లైన్ క్యాబ్, ట్యాక్సీ బుకింగ్, హాలిడే ప్యాకేజీల పేరిట ఈ మోసాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ విభాగం పేర్కొంది. కాగా.. ఈ మోసపూరిత వెబ్‌సైట్లను నమ్మి చెల్లింపులు చేసినవారికి సేవలకు సంబంధించిన మెసేజ్ లు రాకపోగా.. వారిచ్చిన కాంటాక్ట్ నంబర్లను సంప్రదించినప్పుడు రెస్పాన్స్ ఉండట్లేదన్నారు. అందుకే ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం సూచించింది.