ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ? నేడే మోడీ ప్రమాణ స్వీకారోత్సవం

దిశ, నేషనల్ బ్యూరో : 2014, 2019 సంవత్సరాల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వేరు. ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితం వేరు.

Update: 2024-06-08 18:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : 2014, 2019 సంవత్సరాల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వేరు. ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితం వేరు. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. ఈసారి ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలు కింగ్ మేకర్లుగా అవతరించాయి. దీంతో కేంద్ర మంత్రి పదవుల కోసం భారీ పోటీ నెలకొంది. ప్రత్యేకించిన కొన్ని మంత్రిత్వ శాఖలను తమకే ఇవ్వాలని ఎన్డీయే కూటమిలోని పలు మిత్రపక్షాలు బీజేపీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక.. కీలకమైన ఆరు శాఖల గురించి మాట్లాడొద్దని మిత్రపక్షాలకు కమలదళం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆదివారం రాత్రి దాదాపు 27 నుంచి 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీటిలో రెండు క్యాబినెట్ మంత్రి పదవులు టీడీపీకి ఖరారయ్యాయని సమాచారం. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి.. పెమ్మసాని చంద్రశేఖర్‌‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారయ్యాయి అంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ శాఖ, జల వనరుల శాఖలను టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని ఆ కథనాలు తెలిపాయి. కేంద్ర విద్యుత్ శాఖను టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక జేడీయూ ఎంపీలు లల్లన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్‌ కేంద్రమంత్రులు అవుతారని తెలిపాయి. వీరిలో రామ్ నాథ్ ఠాకూర్‌ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.

రైల్వే, ఐటీ శాఖల కోసం పోటాపోటీ..

మంత్రి పదవుల కేటాయింపు విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది ? మిత్రపక్షాలకు ఏయే మంత్రి పదవులను కేటాయిస్తుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేకించి హోం, ఫైనాన్స్, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రైల్వే, ఐటీ, విద్యాశాఖలను బీజేపీయే తీసుకునే అవకాశం ఉంది. అయితే వీటిలో రైల్వే శాఖను జేడీయూ.. ఐటీ శాఖను టీడీపీ అడుగుతున్నాయి. ఒకవేళ రైల్వేశాఖను బీజేపీయే తీసుకుంటే.. కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య-పరిశ్రమల శాఖల సహాయ మంత్రి పదవులలో ఒకదాన్ని జేడీయూ లేదా టీడీపీలకు కేటాయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఏ మిత్రపక్షానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి ? ఏ పార్టీకి ఏ శాఖలు కేటాయించాలి ? అనే దానిపై తానే నిర్ణయం తీసుకుంటానని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆదివారం రాత్రి 30 మందితో కూడిన మంత్రివర్గం ప్రమాణం చేస్తుందని చెబుతున్నప్పటికీ.. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మిత్రపక్షాలకు ఈసారి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తున్నందున.. చాలామంది కీలక బీజేపీ లీడర్లకు ఈసారి క్యాబినెట్ అవకాశం చేజార్ రిస్క్ ఉంది.


Similar News