న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబాన్ని హత్య చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్ల పై విచారణను సుప్రీంకోర్టు జూలై రెండో వారానికి వాయిదా వేసింది. మంగళవారం విచారణ సందర్భంగా దోషుల విడుదలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించాయి. న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేసు గడువును మే 9న ఖరారు చేసింది.
“మేము టైమ్ లైన్‌లను మాత్రమే ఫిక్స్ చేస్తున్నాము. తద్వారా ఏ కోర్టు ఈ విషయాన్ని తీసుకున్నా.. ఈ విధానపరమైన సమస్యలపై సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం ఉండదు. నేను జూన్ 16న వేసవి సెలవుల టైంలో పదవీ విరమణ చేస్తున్నాను. నా చివరి వర్కింగ్ డే మే 19. జస్టిస్ నాగరత్న మే 25 వరకు సింగపూర్‌లో జరిగే సమావేశానికి హాజరవుతారు. మీరందరూ అంగీకరిస్తే.. మేము కోర్టు వేసవి సెలవుల టైంలోనూ కూర్చొని.. ఈ కేసు విచారణను ముగిస్తాం" అని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అయితే వేసవి సెలవులకు ముందే ఈ అంశాన్ని విచారణకు లిస్ట్ చేయొచ్చని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు.
బిల్కిస్ బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా మాట్లాడుతూ.. న్యాయపరమైన ప్రశ్న మాత్రమే నిర్ణయించాల్సిన అవసరం ఉన్నందున ఈ విచారణకు చాలా తక్కువ సమయమే పడుతుందన్నారు. ఈ క్రమంలో దీనిపై జస్టిస్ జోసెఫ్ గుప్తా మాట్లాడుతూ.. “దోషుల తరఫు న్యాయవాది వాదిస్తున్న తీరును బట్టి చూస్తే ఈ విచారణ జరగడం వారికి ఇష్టం లేదన్నట్టు కనిపిస్తోంది. ఈ కేసుపై విచారణకు పిలిచిన ప్రతిసారీ.. వారిలో ఎవరో ఒకరు వచ్చి రిప్లై ఫైల్ చేయడానికి టైం కావాలని చెబుతున్నారు ” అని పేర్కొన్నారు. అయితే, కొత్త బెంచ్ జులై రెండో వారంలో ఈ అంశాన్ని విచారణకు తీసుకుంటుందని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన బెంచ్ వెల్లడించింది. బానో, ఇతరుల తరఫు న్యాయవాది ఈ కేసును సెలవులకు ముందు విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంపై దోషుల తరఫు న్యాయవాది రిషి మల్హోత్రా స్పందిస్తూ.. “ఏమిటీ తొందరపాటు..? మేము ఇప్పటికే ఒక సంవత్సరానికి పైగా వేచి చూడటం లేదా..?" అని కామెంట్ చేశారు.