అలర్ట్..! పరీక్షల వాయిదా లేఖ వార్తను కొట్టిపారేసిన సీబీఎస్ఈ
కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల కోసం రైతులు చేపట్టిన ఆందోళనను కారణంగా పరీక్షలు వాయిదా అంటూ లేఖ వైరల్ అవుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో: సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఈ పరీక్షల తేదీని మార్చారని, వాయిదా వేశారని చెబుతూ ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై సీబీఎస్ఈ బోర్డు తక్షణం స్పందించింది. పరీక్షల తేదీ మార్పు లాంటి నకిలీ సమాచారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలను అప్రమత్తం చేస్తూ ప్రకటన జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల కోసం రైతులు చేపట్టిన ఆందోళనను కారణంగా చూపుతూ 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని, కొత్త తేదీలను మళ్లీ ప్రకటిస్తామని సూచిస్తూ సీబీఎస్ఈ బోర్డు పేరు మీద లేఖ వైరల్ అవుతోంది. దీని గురించి తమకు సమాచారం అందిందని, అలాంటి నకిలీ లేఖలను నమ్మొద్దని ఎక్స్‌లో ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. 'విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో తిరిగే లేఖ నకిలీ. తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో ఎవరో వైరల్ చేశారని, అటువంటి నిర్ణయమేదీ బోర్డు తీసుకోలేదని' పేర్కొంది. గురువారం ప్రారంభమైన సీబీఎస్ఈ పరీక్షలు భారత్‌తో పాటు పలు దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవల మొదలైన భారతీయ రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ బోర్డు పలు సూచనలు చేసింది. పరీక్షల కోసం ముందుగానే పరీక్షా కేంద్రాలకు బయలుదేరాలని సూచించింది.