బెంగాల్ జాబ్స్ స్కామ్‌లో సీబీఐ దూకుడు..
జాబ్స్ స్కామ్‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని 14 మున్సిపాలిటీలలో సీబీఐ అధికారులు బుధవారం రైడ్స్ చేశారు.
కోల్ కతా: జాబ్స్ స్కామ్‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని 14 మున్సిపాలిటీలలో సీబీఐ అధికారులు బుధవారం రైడ్స్ చేశారు. కోల్ కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న పశ్చిమ బెంగాల్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. ఈ సంస్థల్లో జాబ్స్ రిక్రూట్మెంట్స్ క్రమంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలకు సంబంధించిన ఆధారాలను సీబీఐ టీమ్ సేకరించింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయాన్ సిల్, అతడి కంపెనీ ఏబీఎస్ ఇన్ఫోజోన్ ప్రైవేట్ లిమిటెడ్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
అయాన్ సిల్‌కు చెందిన ఏబీఎస్ ఇన్ఫోజోన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మున్సిపాలిటీల జాబ్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్ల ముద్రణ, వ్యాల్యుయేషన్ వర్క్స్ నిర్వహించింది. అయితే ఎగ్జామ్ రాసినవారి స్కోర్‌లను అతడి సంస్థ తారుమారు చేసిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ కుంభకోణాన్ని క్రిమినల్ కోణంలో సీబీఐ.. ఆర్థిక అవకతవకల కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.