ఆ టీవీ ఛానల్‌లో డీకే శివకుమార్ పెట్టుబడులు.. రంగంలోకి సీబీఐ

దిశ, నేషనల్ బ్యూరో : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ దృష్టిసారించింది.

Update: 2023-12-31 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ దృష్టిసారించింది.ఇందులో భాగంగా కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్‌కు బెంగళూరులోని సీబీఐ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. డీకే శివకుమార్‌ పెట్టిన పెట్టుబడుల వివరాలను అందించాలని ఆ ఛానల్ యాజమాన్యాన్ని కోరింది. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో జనవరి 11న బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది. డీకే శివకుమార్, ఆయన భార్య ఉషా శివకుమార్ ఛానల్‌లో పెట్టిన పెట్టుబడుల సమాచారంతో పాటు వారికి కంపెనీ నుంచి చెల్లించిన డివిడెండ్‌లు, షేర్ లావాదేవీల వివరాలను అందించాలని నిర్దేశించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 91 కింద ఈ నోటీసులను జారీ చేశామని సీబీఐ పేర్కొంది. దీనిపై జైహింద్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, కేరళ కాంగ్రెస్ నేత బీఎస్ షిజు మాట్లాడుతూ.. సీబీఐ కోరిన అన్ని పత్రాలను అందజేస్తామన్నారు. అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని, ప్రతీ లావాదేవీ చట్టబద్ధంగానే జరిగిందని స్పష్టం చేశారు. సీబీఐ చర్య కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకారానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు. ఈ కేసును గతంలో బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేసి, అంతా సక్రమంగానే ఉందని తేలడంతో మూసేసిందని చెప్పారు.

Tags:    

Similar News