సాఫ్ట్‌వేర్ కొనుగోలు వ్యవహారంలో ఎయిర్ఇండియాపై సీబీఐ కేసు నమోదు
ఎయిర్ఇండియా మాజీ సీఎండీ అరవింద్ జాదవ్, ఐబీఎం ఇండియా, ఎస్ఏపీ(శాప్) ఇండియాతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర కింద
దిశ, నేషనల్ బ్యూరో: ఒకప్పటి ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కోసం సాఫ్ట్‌వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సంస్థ సీఎండీ, శాప్ ఇండియా, ఐబీఎంపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆదివారం అధికారులు వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్ కొనుగోలు విలువ రూ. 225 కోట్లని, దీనికి సంబంధించిన విధానపరమైన అవకతవకలు గుర్తించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీబీఐకి సిఫార్సు చేసిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. దాదాపు ఆరేళ్లపాటు జరిగిన విచారణ తర్వాత ఎయిర్ఇండియా మాజీ సీఎండీ అరవింద్ జాదవ్, ఐబీఎం ఇండియా, ఎస్ఏపీ(శాప్) ఇండియాతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర కింద సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సరైన టెండరింగ్ విధానాన్ని అనుసరించకుండానే ఎయిర్ఇండియా ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్(ఈఆర్‌పీ)ను శాప్ ఏజీ నుంచి కొనుగోలు చేసిందని విచారణలో తేలింది. అప్పటికే ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ అమల్లో ఉన్నందున దాని అవసరాన్ని సమర్థించకుండా ఎయిర్ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఈఆర్‌పీని ఎంపిక చేసిందని కమిషన్ పేర్కొంది.