మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేం: కాంగ్రెస్

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ స్పందించారు.

Update: 2024-01-24 09:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ స్పందించారు. మమతా బెనర్జీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని తెలిపారు. అసోంలో జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమికి టీఎంసీ కీలక భాగస్వామి అని అన్నారు. టీఎంసీతో ఇంకా చర్చలు జరుపుతున్నామని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ జోడో న్యాయ్ యాత్రపై తనకు సమాచారం ఇవ్వలేదని మమతా బెనర్జీ చేసిన ఆరోపణపై స్పందిస్తూ.. భారత్ జోడో న్యాయ్ యాత్రకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు తెలిపారు. మరోవైపు, మమతా బెనర్జీ ప్రకటనపై ఆర్జడీ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. ‘ఏదైనా సమస్య ఉంటే కూటమి పరిష్కరిస్తుంది. కాబట్టి మమతా బెనర్జీ కొంత సమయం వేచి ఉండాల్సింది. బహుశా ఏదైనా నిర్దిష్ట పరిస్థితిలో ప్రకటన చేసి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.

టీఎంసీతో సీట్ షేరింగ్ కష్టమే: ఆప్

‘పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పెద్ద పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు ఎప్పటినుంచో వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాబట్టి టీఎంసీతో సీట్ల పంపకం కొంచెం కష్టమైనదే. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ విజయానికి కట్టుబడి ఉన్నారు. భారత కూటమిలోని అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోరాడతాయని ఆశిస్తున్నాం’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోరాడాలని మమతా బెనర్జీ నిర్ణయించుకోవడం నైరాశ్యానికి నిదర్శనమని బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News