Railways : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. భారీ రైల్వే ప్రాజెక్టు మంజూరు

దిశ, నేషనల్ బ్యూరో : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పచ్చజెండా ఊపింది.

Update: 2024-08-09 19:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పచ్చజెండా ఊపింది. వీటి అంచనా వ్యయం రూ.24,657 కోట్లు. కొత్త ప్రాజెక్టులలో జునాగఢ్ - పాండురంగపురం రైల్వే లైన్ చాలా కీలకమైంది. ఎందుకంటే దీని పరిధిలోనే తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని పాండురంగాపురం ఉన్నాయి. గుజరాత్‌లోని జునాగఢ్‌లో మొదలయ్యే ఈ రైల్వే లైన్ ఒడిశాలోని నవరంగాపూర్, జేపోర్, మల్కన్‌గిరి, తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని విశాఖ పరిధిలో ఉన్న పాండురంగాపురం వరకు విస్తరించి ఉంటుంది. ఇవన్నీ గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడం వల్లే రైల్వే లైనును మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నవరంగాపూర్ - జేపోర్ - మల్కన్‌గిరి మార్గంలో 170 కి.మీ కొత్త రైల్వే లైనును 2017 -18లోనే మంజూరు చేశారు. జునాగఢ్‌ టు నవరంగాపూర్ లైన్‌తో పాటు మల్కన్‌గిరి - భద్రాచలం- పాండురంగాపురం లైన్‌ను ఇప్పుడు తాజాగా మంజూరు చేశారు.

వరంగల్ నుంచి భద్రాచలం మీదుగా..

జునాగఢ్ - పాండురంగపురం రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలోని తూర్పుతీర ప్రాంతాలను ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా మీదుగా నడిచే రైళ్లే కవర్ చేస్తున్నాయి. ఈ కొత్త రైల్వే ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ నుంచి భద్రాచలం మీదుగా బెంగాల్‌లోని అసన్‌సోల్ వరకు కొత్తగా రైల్వే నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. మహానది కోల్ ఫీల్డ్ ఏరియా నుంచి మన దేశంలోని విద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సప్లై అయ్యే దూరం కూగా తగ్గిపోతుంది. ఈ రైల్వే ప్రాజెక్టు వల్ల దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల నుంచి దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దూరం దాదాపు 124 కి.మీ మేర తగ్గుతుంది. రాజమండ్రి, విశాఖపట్నం వంటి బిజీ రైల్వే కారిడార్‌లను టచ్ చేయకుండా దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానం పొందే వెసులుబాటు కలుగుతుంది.

అంచనా వ్యయం రూ.7,383 కోట్లు

జునాగఢ్ - పాండురంగపురం రైల్వే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7,383 కోట్లు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1 కోటి పనిదినాలు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. జునాగఢ్ - పాండురంగపురం రైల్వే లైన్ కోసం దాదాపు 1697 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 267 కోట్ల కేజీల కర్బన ఉద్గారాల విడుదల తగ్గిపోతుంది. ఈ మార్పు 10.7 కోట్ల మొక్కలు నాటిన కార్యంతో సమానం.

రైల్వే మంత్రి ఏమన్నారంటే..

కొత్తగా మంజూరు చేసిన 8 రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. తద్వారా మన దేశపు లాజిస్టికల్ సామర్థ్యం ఇనుమడిస్తుందన్నారు. ‘‘ఈ రైల్వే ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే వాతావరణంలోకి 767 కోట్ల కేజీల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గిపోతుంది. ఈ మార్పు 30 కోట్ల మొక్కలను నాటడానికి సమానం’’ అని రైల్వే మంత్రి చెప్పారు.

14 జిల్లాల్లోనే ఆ 8 రైల్వే ప్రాజెక్టులు

8 కొత్త రైల్వే ప్రాజెక్టులు ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, జార్ఖండ్, బిహార్, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న 14 జిల్లాలను కనెక్ట్ చేయనన్నాయి. ఈ ప్రాంతాల్లోని రైల్వే నెట్‌వర్క్ దాదాపు 900 కిలోమీటర్ల మేర పెరగనుంది. 14 జిల్లాల పరిధిలో 64 కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. వీటిలో 6 జిల్లాలను యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్‌గా గుర్తించారు. ఈ జాబితాలో ఈస్ట్ సింగ్బం, భద్రాద్రి కొత్తగూడెం, మల్కాన్ గిరి, కలహండి, నబరంగాపూర్, రాయగడ ఉన్నాయి. కొత్త రైల్వే ప్రాజెక్టుల పరిధిలో 510 గ్రామాలు, 40 లక్షల జనాభా ఉందని రైల్వేశాఖ తెలిపింది.

ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు ఇవీ..

1. గునుపూర్ - థేరుబలి (కొత్త లైన్) - 73.62 కిమీ - ఒడిశాలోని రాయగడ జిల్లాలను ఈ రైల్వే లైన్ కవర్ చేస్తుంది.

2.జునాగఢ్ - నబరంగాపూర్ - 116.21 కి.మీ - ఒడిశాలోని కలహండి, నబరంగాపూర్ జిల్లాలను ఈ రైల్వే లైన్ కవర్ చేస్తుంది.

3.బాదాం పహర్ - కందుఝార్ ఘర్ - 82.06 కి.మీ - ఒడిశాలోని కియోంఝర్, మయూర్ భంజ్ జిల్లాలను ఈ లైన్ కవర్ చేస్తుంది.

4.బంగ్రిపోసి - గోరుమా హిసానీ - 85.60 కి.మీ - ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాను ఈ లైన్ కవర్ చేస్తుంది.

5.మల్కాన్ గిరి - పాండురంగాపురం (వయా భద్రాచలం) - 173.61 కి.మీ - ఒడిశా, ఏపీ, తెలంగాణలోని మల్కన్ గిరి, ఈస్ట్ గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను ఈ లైన్ కవర్ చేస్తుంది.

6.బురామర - చాకులియా - 59.96 కి.మీ - జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలలోని ఈస్ట్ సింగ్బం, ఝార్ గ్రామ్, మయూర్ బంజ్ జిల్లాలను ఈ లైన్ కవర్ కవర్ చేస్తుంది.

7.జాల్నా - జల్ గావ్ - 174 కి.మీ - మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాను ఈ లైన్ కవర్ చేస్తుంది.

8. బిక్రం శిలా - కాటా రియా - 26.23 కి.మీ - బిహార్‌లోని భాగల్ పూర్ జిల్లాను ఈ లైన్ కవర్ చేస్తుంది.

Tags:    

Similar News