2 లక్షల వ్యవసాయ, పాడి, మత్స్య సొసైటీలు ఏర్పాటు
వ్యవసాయ రుణాలు, డైయిరీ, మత్స్య పరిశ్రమలను బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: వ్యవసాయ రుణాలు, డైయిరీ, మత్స్య పరిశ్రమలను బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ రుణ సొసైటీలు, డెయిరీ-ఫిషరీ(పాడి-మత్స్య) సహాకార సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇప్పటివరకు సదుపాయం లేని గ్రామాలు, పంచాయితీలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 63వేలకు పైగా ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు క్రియాశీలకంగా ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న సొసైటీలను అధునీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటి ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికల్పనకు మార్గం ఉంటుందని చెప్పారు. కేంద్రం ఇప్పటికే సొసైటీ కార్యనిర్వహణలో పారదర్శకత కోసం కంప్యూటీకరణకు ఆమోదం తెలిపింది. సొసైటీలను విస్తరించేందుకు, బహుళ కార్యకలాపాలు/సేవలను చేపట్టేందుకు కంప్యూటరీకరణ సహాయం చేస్తుంది. 63,000లకు పైగా సొసైటీలు కంప్యూటరైజ్ చేస్తున్నారు. దీనికి గానూ మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,516 కోట్లు, ఇందులో కేంద్ర వాటా రూ.1,528 కోట్లుగా ఉంది.