సీఏఏ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ప్రారంభించిన కేంద్రం
భారతీయ పౌరసత్వం కోసం వెబ్‌పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చింది. మొబైల్ యాప్ - సీఏఏ 2019 - ని కూడా లాంచ్ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనల నోటిఫికేషన్ వెలువడిన ఒకరోజు తర్వాత చట్ట ప్రకారం భారతీయ పౌరసత్వం కోసం వెబ్‌పోర్టల్ (indiancitizenshiponline.nic.in)ను కేంద్రం తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) మంగళవారం దీన్ని ప్రారంభించింది. మొబైల్ ఫోన్‌ల ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు మొబైల్ యాప్ - సీఏఏ 2019 - ని త్వరలో తీసుకురానున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎంహెచ్ఏ వెబ్‌పోర్టల్ ప్రకారం.. అర్హత కలిగిన దరఖాస్తుదారులను పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఆరు వర్గాల హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. 2014, డిసెంబర్ 31 లేదా అంతకుముందు భరత్‌కు వచ్చిన వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు..
* ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్ కాపీ
* ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఎఫ్ఆర్ఆర్ఓ) జారీ చేసిన సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ పర్మిట్
* ఆ దేశాల్లోని స్కూల్ లేదా కాలేజ్, బోర్డు, యూనివర్శిటీ అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్
* ఆయా దేశాల్లోని ఇతర ప్రభుత్వాధికారులు లేదా సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం
* ఆయా దేశాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా లైసెన్స్
* భూమి లేదా అద్దె రికార్డులు
* దరఖాస్తుదారు తల్లిదండ్రులు లేదా తాతలు లేదా వారి ముందు తరానికి చెందినవారి పత్రాలు
వీటికి అదనంగా, దరఖాస్తుదారులు 2014, డిసెంబరు 31 లేదా అంతకు ముందు భారత్‌లోకి ప్రవేశించినట్లు నిరూపించే ఏవైనా పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి వెబ్ పోర్టల్‌లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
సీఏఏ కింద పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
1. ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌లో 'సీఏఏ 2019 కింద భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తును సమర్పించడానికి క్లిక్ చేయాలని సూచించే దానిపై క్లిక్ చేయాలి.
2. మొబైల్ నంబర్. కాప్చా కోడ్‌ని నమోదు చేయాలి.
3. కింది పేజీలో, ఈ-మెయిల్ ఐడీ, పేరు, కాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
4. మెయిల్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఎంటర్ చేయాలి. అడిషనల్ వెరిఫికేషన్ కోసం కాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి.
5. లాగ్-ఇన్ విండోలో కాప్చా కోడ్‌తో పాటు మెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, కంటిన్యూపై క్లిక్ చేయాలి.
6. మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీ, కాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
7. వెరిఫికేషన్ తర్వాత ఫ్రెష్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయాలి. అనంతరం 2014కి ముందు నివాసం, ప్రదేశం సహా ఇతర వివరాలను ఎంచుకోవాలి.