హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన BSP
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది
దిశ, నేషనల్ బ్యూరో: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. సిమ్లా (రిజర్వ్) స్థానంలో అనిల్ కుమార్, హమీర్‌పూర్ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా హేమ్ రాజ, మండి నుంచి ప్రకాష్ చంద్ భరద్వాజ్, కాంగ్రా స్థానం నుంచి రేఖా రాణిలను బీఎస్పీ తమ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల షెడ్యూల్డ్ కులాల వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తుందని రాష్ట్ర బీఎస్పీ చీఫ్ నారాయణ్ ఆజాద్ అన్నారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇటీవల ఉనాలో జరిగిన పార్టీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను చర్చించి ఆమోదం కోసం పార్టీ హైకమాండ్‌కు పంపారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు పోటాపోటీగా తమ ప్రచారాలతో నియోజకవర్గాలను హోరెత్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల తన అభ్యర్థికి రాజ్యసభ సీటును పొందడంలో విఫలమైంది. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని ప్రత్యర్థి బీజేపీల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ జూన్ 1న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.