వేటుపడిన ఉద్యోగులంతా తిరిగి విధుల్లోకి

దిశ, నేషనల్ బ్యూరో : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-09 15:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం తొలగించిన దాదాపు 25 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించింది. వారంతా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు సమర్పించి విధుల్లో చేరొచ్చని వెల్లడించింది. గురువారం ఢిల్లీలోని చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ యాజమాన్యం తరఫు ప్రతినిధులు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సమావేశమై రాజీ చర్చలు జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో ఉద్యోగులు అకస్మాత్తుగా మూకుమ్మడి సెలవులు పెట్టినందు వల్ల 170కిపైగా విమాన సర్వీసులు రద్దయిన అంశాన్ని యాజమాన్యం తరఫు ప్రతినిధులు ప్రస్తావించారు. మే 7,8 తేదీల్లో ఉద్యోగాల నుంచి తొలగించిన 25 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. ఈ పురోగతిపై చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై యాజమాన్యం తరపు ప్రతినిధులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధుల సంతకాలు ఉన్నాయి. ఈ చర్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. త్వరలోనే ఆ విమానయాన సంస్థ సర్వీసులు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News