యూపీలోని రామ్ జానకీ ఆలయానికి బాంబు బెదిరింపు
అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన వారం వ్యవధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రామ్ జానకీ ఆలయానికి ఆదివారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆలయాన్ని పేల్చేస్తామని దుండగులు పోస్టర్లు అతికించారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన వారం వ్యవధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు బెదిరింపులతో కూడిన అనేక పోస్టర్లు ఆలయ గోడలపై అతికించడమే కాకుండా, ఆలయంలో నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ నేత రోహిత్ సాహుకు సైతం చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. రోహిత్ సాహూ రామ్ జానకీ ఆలయ ట్రస్టీగా ఉన్నారు. దీని గురించి స్పందించిన రోహిత్ సాహూ సోదరుడు, 'ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామనే పోస్టర్లు అతికించనట్టు ఆదివారం ఉదయం తమకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చెల్లాచెదురుగా ఆలయంలో పోస్టర్లు పడి ఉన్నాయి. అనంతరం ఆలయాన్ని మూసివేశామని, బారికేడ్లను ఏర్పాటు చేసినట్టు' వివరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.