Blast: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు..18 మంది కార్మికులు మృతి

గుజరాత్‌లోని బనస్కంతా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందారు.

Update: 2025-04-01 12:03 GMT
Blast: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు..18 మంది కార్మికులు మృతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని బనస్కంతా (Banaskantha) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి18 మంది కార్మికులు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం కర్మాగారంలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా బాణాసంచా నిల్వ చేసిన రూంలో బాయిలర్ పేలి మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. అంతేగాక పేలుడు ధాటికి భవనం స్లాబ్ సైతం కూలిపోయినట్టు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో మరికొంత మంది దాని కింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు చెందిన వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులేనని తెలుస్తోంది. ఇందులో కొందరు కార్మికులు రెండు రోజుల క్రితమే విధుల్లో చేరినట్టు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ (Bhupendra patel) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ‘దీసాలోని బాణసంచా గోడౌన్‌లో అగ్నిప్రమాదం, స్లాబ్ కూలి కార్మికులు మరణించిన ఘటన హృదయ విదారకమైంది. ఈ దుఖ సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్ కార్మికులు మరణించడంపై ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ సైతం స్పందించారు. కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News