Amit Shah : కాంగ్రెస్ నేతల చేతుల్లో ఖాళీ రాజ్యాంగం.. అమిత్‌షా ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ నేతల చేతిలో ఉండేది ఖాళీ పేజీలతో కూడిన నకిలీ రాజ్యాంగమని ప్రజలందరికీ తెలిసిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ నేతల చేతిలో ఉండేది ఖాళీ పేజీలతో కూడిన నకిలీ రాజ్యాంగమని ప్రజలందరికీ తెలిసిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. అందుకే ఇటీవలే జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. ‘‘మహారాష్ట్రలో ఓడిపోతే ఈవీఎంల మాయ అని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ.. జార్ఖండ్‌లో గెలిచిన వెంటనే జేఎంఎంతో కలిసి ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోయింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగం(Constitution)పై రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్‌షా(Amit Shah) ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లా మరే పార్టీ కూడా రాజ్యాంగాన్ని వక్రీకరించలేదన్నారు. రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ 77 సవరణలు చేస్తే.. బీజేపీ 22 సవరణలే చేసిందని అమిత్‌షా చెప్పారు.
‘‘సమానత్వం అనేది భారత రాజ్యాంగానికి గుండెకాయ లాంటిది. అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)ను ఎందుకు అమలు చేయకూడదు ? ముస్లిం పర్సనల్ లాను తొలి ప్రధాని నెహ్రూ తీసుకొచ్చారని యూసీసీని అమలు చేయకూడదా ?’’ అని హోంమంత్రి ప్రశ్నించారు. ‘‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కశ్మీరులో రక్తపాతం జరుగుతుందని విపక్షాలు చెప్పాయి. కానీ ఎవ్వరూ రాళ్లు కూడా రువ్వలేదు’’ అని ఆయన చెప్పారు. ‘‘వీర సావర్కర్‌ను ఇందిరాగాంధీ కూడా గౌరవించారు. స్వాతంత్య్ర సమర యోధులకు మతాలు, సైద్ధాంతికతలతో లింక్ పెట్టొద్దని నేను విపక్షాలను కోరుతున్నాను’’ అని అమిత్‌షా తెలిపారు.