కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనేదే బీజేపీ ప్లాన్: ఢిల్లీ మంత్రి అతిశీ విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయంగా అణిచివేయాలని బీజేపీ, ప్రధాని మోడీ కోరుకుంటున్నారని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయంగా అణిచివేయాలని బీజేపీ, ప్రధాని మోడీ కోరుకుంటున్నారని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ విమర్శించారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈడీ సోదాలు కేజ్రీవాల్‌ను అణిచివేసేందుకు చేసిన దాడి తప్ప మరొకటి కాదని తెలిపారు. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక్కరే బీజేపీని, మోడీని బహిరంగంగా సవాల్ చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అధికారులు ఏ కేసుకు సంబంధించి బిభవ్ ఇంటికి వెళ్లారో కూడా స్పష్టం చేయలేదని విమర్శించారు. ఈడీ అధికారులు భిభవ్ ఇంట్లో ఓ జీమెయిల్ అకౌంట్ డౌన్ లోడ్ చేసుకుని, మూడు ఫోన్లను తీసుకెళ్లారని తెలిపారు. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ తీరు ఇదేనా అని అతిశీ ప్రశ్నించారు. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే కేంద్రం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తుందని మండిపడ్డారు.
ఈడీ ఫిర్యాదుపై నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ వాటిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. బుధవారం సాయంత్రం దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. కాగా, ఫిబ్రవరి 2న కేజ్రీవాల్‌కు ఈడీ ఐదో సారి సమన్లు పంపింది. గతేడాది డిసెంబర్ 21, నవంబర్ 2, ఏడాది జనవరి 3, 17 తేదీల్లో నోటీసులు జారీ చేసింది.