తొలి దశతోనే బీజేపీ ఓటమి ఖాయమైంది: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌లోనే బీజేపీ ఓటమి ఖాయమైందని రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌లోనే బీజేపీ ఓటమి ఖాయమైందని రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. శనివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ 400 సీట్ల సినిమా మొదటి రోజే ఫెయిల్ అయ్యిందని జోస్యం చెప్పారు. బిహార్ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలోని మహాఘట్ బంధన్ తొలిదశలోనే నాలుగు సీట్లను గెలుపొందిందని తెలిపారు. బిహార్ ఫలితాలు బీజేపీకి షాక్ ఇస్తాయని, మొదటి దశలో తమకు పోటీ లేదని స్పష్టం చేశారు. మోడీ బిహార్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు.
2014, 2019లో ఇచ్చిన హామీలే ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. బీజేపీ తప్పుడు వాగ్ధానాలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహాఘట్ బంధన్, ఇండియా కూటమి కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. బిహార్‌లో నిరుద్యోగమే అతిపెద్ధ సమస్యగా మారిందని చెప్పారు. దేశంలోని ఏ సమస్యను కూడా బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు.
కాగా, బిహార్‌లో తొలి దశలో భాగంగా జముయి, నవాడ, గయా, ఔరంగాబాద్ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగగా.. 48.88 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లకు గాను 39 స్థానాలను గెలుచుకుంది. మహాఘట్‌బంధన్ కూటమి కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది.