ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

'సమృద్ధ్ క్రుషక్ నీతి' కింద క్వింటాల్‌కు రూ. 3,100 చొప్పున వరిని కొనుగోలు

Update: 2024-05-05 18:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆదివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ మేనిఫెస్టోలో పలు కీలక హామీలిచ్చింది. ఐదేళ్లలో 3.5 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ. 50,000 నగదు వోచర్, చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన డబ్బును తిరిగివ్వడం, రూ. 3,100 చొప్పున వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పేర్కొంది. 'మోడీకా గ్యారెంటీ ఫర్ ఒడిశా 2024' పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో 'సమృద్ధ్ క్రుషక్ నీతి' కింద క్వింటాల్‌కు రూ. 3,100 చొప్పున వరిని కొనుగోలు చేసి, 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 'సుభద్ర యోజన ' పథకాన్ని ప్రారంభిస్తామని, దీని కింద ఒక్కో మహిళకు రూ.50 వేల నగదు వోచర్ అందజేయనున్నట్టు, దీన్ని రెండేళ్లళో క్యాష్ చేసుకోవచ్చని తెలిపింది. 2027 నాటికి ఒడిశాలో 25 లక్షల 'లఖ్‌పతి దీదీ'లను సృష్టించే లక్ష్యంతో ఉన్నట్టు బీజేపీ ప్రకటించింది. దీనికోసం ప్రతి 500 స్వయం సహాయక బృందాలకు పారిశ్రామిక క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తామని, ఇందులో ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రమోషన్ కోసం సౌకర్యాల నిర్వహణను అందిస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రం వెలుపల నివశించే ఒడియా ప్రజల సంక్షేమన్ కోసం దేశంలో అన్ని మెట్రో నగరాల్లో ఒడియా సముదాయ భవన్‌ను నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మత్స్యకారులకు వార్షిక లీన్ పీరియడ్ భత్యం రూ. 10 వేలు, రాష్ట్రంలో 75 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, గిరిజన విద్యార్థులకు ఏటా రూ. 5 వేల స్కాలర్‌షిప్, సీనియర్ సిటిజన్, శారీరక వికలాంగులు, వితంతువులకు నెలకు రూ. 3,000 పెన్షన్ హామీని బీజేపీ ప్రకటించింది. కాగా, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు మే 13న 21 లోక్‌సభ స్థానాలతో కలిపి పోలింగ్ జరగనుంది. 

Tags:    

Similar News