హిందూ ముస్లింల మధ్య బీజేపీ చీలికలు సృష్టిస్తోంది: తేజస్వీ యాదవ్
దేశంలో హిందూ ముస్లిం జనాభాపై ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలి విడుదల చేసిన నివేదికపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో హిందూ ముస్లిం జనాభాపై ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలి విడుదల చేసిన నివేదికపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. జనగనణ చేపట్టకుండా హిందూ ముస్లిం జనాభాను కేంద్రం ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎం ఆర్థిక సలహా మండలి తాజా రిపోర్టుపై అనేక సందేహాలున్నాయని తెలిపారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అంతేగాక హిందూ ముస్లింల మధ్య చీలికలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా దేశంలోని సమస్యలపై మాట్లాడాలని ప్రధాని మోడీకి సూచించారు. ‘నిరుద్యోగం, ధరల పెరుగుదల అనేక ఇతర ముఖ్యమైన సమస్యల గురించి బీజేపీ మాట్లాడటం లేదు. బిహార్‌కు ప్రత్యేక హోదా గురించి మోడీ స్పందించడం లేదు. కేవలం సమాజాన్ని విభజించేందుకే ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.