ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు?
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ అవుతోంది. జూన్ 10న సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని భావించినప్పటికీ.. దాన్ని జూన్ 12కి వాయిదా వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ అవుతోంది. జూన్ 10న సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని భావించినప్పటికీ.. దాన్ని జూన్ 12కి వాయిదా వేశారు. అయితే, సీఎం ఎవరనే అంశంపై బీజేపీ అధిష్ఠానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగానే, పార్టీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్‌లను కేంద్ర పరిశీలకులుగా నియమించింది. బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ సోమవారం భేటీకానున్నారు. ఆ సమావేశాన్ని రాజ్ నాథ్ సింగ్,భూపేందర్ యాదవ్ పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాతే సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడనుంది.
సీఎం అభ్యర్థి పేరు చెప్పకుండానే ప్రచారం
ఇదిలా ఉంటే, రెండున్నర దశాబ్దాలపాటు ఒడిశాని పాలించిన బిజూ జనతాదళ్.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 78 చోట్ల గెలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ప్రచారం చేసిన కాషాయ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకుంది.