నితీశ్ వర్సెస్ తేజస్వి.. విశ్వాస పరీక్ష రేపే.. ఎవరి బలం ఎంత ?
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారు సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారు సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. తన పార్టీ జేడీయూ, మిత్రపక్షం బీజేపీతో కలిసి ఇందులో బలనిరూపణ చేసుకుంటే ఇక నితీశ్ సర్కారుకు ఢోకా ఉండదు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కనీసం 122 మంది మద్దతును విశ్వాస పరీక్షలో పొందాల్సి ఉంటుంది. అయితే జేడీయూ, బీజేపీలతో ఏర్పడిన ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 128 సీట్ల బలం ఉంది. ఈ లెక్కన బల నిరూపణలో నితీశ్ అండ్ టీమ్ నెగ్గడం లాంఛనమే. అయితే ఆట ఇంకా మిగిలే ఉందంటూ లాలూ తనయుడు, ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ చేస్తున్న వ్యాఖ్యలతో కొంత సస్పెన్స్ ఏర్పడుతోంది. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరి ఇటీవల రాజీనామా చేసేందుకు నిరాకరించారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహిస్తానని ఆయన అంటున్నారు. అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసును నితీశ్ సర్కారు ప్రవేశపెడుతుంది. దానిపై అధికార, విపక్షాల మధ్య చర్చ జరుగుతుంది. ఇదంతా ముగిసిన తర్వాత నితీశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను కోరనుంది.
ఎవరి బలం ఎంత ?
ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరడానికి ముందు వరకు నితీశ్ కుమార్ మహాఘట్బంధన్ కూటమిలో ఉండేవారు. దానిలో జేడీయూతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీలు మిత్రపక్షాలుగా ఉండేవి. నితీశ్ జంప్ కావడంతో అలర్టయిన ఆర్జేడీ.. తమ పార్టీకి చెందిన 79 మంది ఎమ్మెల్యేలను తేజస్వి యాదవ్ నివాసానికి పిలిచి బస ఏర్పాట్లు చేసింది. ఇక కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేల్లో 16 మందిని ఆ పార్టీ అధికారంలో ఉన్న హైదరాబాద్‌కు తరలించారు. ఆ 16 మంది సోమవారం తెల్లవారుజాము కల్లా హైదరాబాద్ నుంచి పాట్నాకు తిరిగి చేరుకుంటారని సమాచారం. ఎన్డీఏ కూటమికి చెందిన 128 మంది ఎమ్మెల్యేలలో 78 మంది బీజేపీ, 45 మంది జేడీయూ, నలుగురు హిందుస్తానీ అవామ్ మోర్చా, ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఇక మహాఘట్బంధన్ కూటమికి చెందిన 114 మంది ఎమ్మెల్యేలలో 79 మంది ఆర్జేడీ, 19 మంది కాంగ్రెస్, 12 మంది సీపీఐ(ఎంఎల్), ఇద్దరు సీపీఎం, ఇద్దరు సీపీఐ, ఒకరు మజ్లిస్ పార్టీ నుంచి ఉన్నారు.