బెంగాల్ సీఎం దీదీతో బీహార్ సీఎం నితీశ్ భేటీ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ హౌరాలో భేటీ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ హౌరాలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఇక భేటీ అనంతరం నితీశ్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి భేటీలో చర్చించామని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి విపక్షాలన్నింటినీ ఒక్కతాటికి ఎలా తీసుకురావాలనే అంశంపై దీదీతో చర్చించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధం కోసం పని చేస్తుందే తప్ప దేశాభివృద్ధి కోసం కాదని నితీశ్ అన్నారు.
అనంతరం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. జయప్రకాశ్ వంటి మహానేతలు బీహార్ నుంచే ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పారు. విపక్షాలకు సంబంధించిన సమావేశాన్ని బీహార్ లో ఏర్పాటు చేయాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు చెప్పానని దీదీ తెలిపారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకొని అందుకనుగుణంగా ముందుకు వెళ్దామని ఆయనకు సూచించినట్లు చెప్పారు. మీడియా సపోర్టు, అబద్ధాల ప్రచారంతో బీజేపీ దేశంలో హీరోగా మారిందని, దాన్ని జీరో చేయడమే అన్ని పార్టీల లక్ష్యం కావాలని దీదీ అన్నారు.
Also Read..
మళ్లీ తెరపైకి ‘‘రాయల తెలంగాణ’’.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన డిమాండ్