Bihar Special Status: నితీశ్‌కు షాక్.. బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేమన్న కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌కు షాక్ తగిలింది.

Update: 2024-07-22 12:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌కు షాక్ తగిలింది. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఆ పార్టీ చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆదివారం రోజు పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ కోరింది. అయినా దాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేయడం గమనార్హం. బిహార్‌లోని ఝంఝార్‌పూర్ లోక్‌సభ ఎంపీ రాంప్రీత్ మండల్‌ (జేడీయూ)కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి ఈవిషయాన్ని తెలిపారు. 2012 సంవత్సరంలో ఇంటర్‌ మినిస్టీరియల్‌ గ్రూప్‌ (ఐఎంజీ) ఇచ్చిన నివేదిక ప్రకారం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఆయన తేల్చిచెప్పారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌‌డీసీ) మార్గదర్శకాల ప్రకారమే అప్పట్లో ఐఎంజీ ఆ నిర్ణయాన్ని తీసుకుందన్నారు.

‘‘ఎన్‌డీసీ గైడ్‌లైన్స్ ప్రకారం.. ప్రత్యేక హోదాకు ఎంపిక చేసే రాష్ట్రంలో కొండలు, కష్టతరమైన భూభాగం ఉండాలి. తక్కువ జన సాంద్రత, అత్యధిక గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు. పొరుగు దేశాల సరిహద్దుల వెంట వ్యూహాత్మక స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వొచ్చు. ఆర్థికపరమైన, మౌలిక సదుపాయాలపరమైన వెనుకబాటుతనం ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు. తీవ్ర ఆర్థిక వనరుల లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రాలకు సైతం స్పెషల్ స్టేటస్‌ను ఇవ్వొచ్చు’’ అని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ప్రస్తుతం జేడీయూ, టీడీపీ కింగ్ మేకర్లుగా ఉన్నాయి. జేడీయూకు 12 మంది ఎంపీల బలం ఉంది. కాగా, ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ గళం వినిపించింది. ఈ అంశాన్ని టీడీపీ లేవనెత్తకపోవడం గమనార్హం.

Tags:    

Similar News