Bengaluru: బెంగళూరులో ఎల్‌ఈడీ వీధిలైట్లు.. రూ. 684 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం

సమగ్ర వార్షిక శక్తి పొదుపు నమూనా కింద ఎల్ఈడీ వీధిలైట్లకు మారే ప్రణాళికకు తాజాగా ఆమోదం తెలిపింది.

Update: 2024-08-27 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు పౌర పరిపాలనా సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలోని వీధి దీపాలను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించింది. సమగ్ర వార్షిక శక్తి పొదుపు నమూనా కింద ఎల్ఈడీ వీధిలైట్లకు మారే ప్రణాళికకు తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. నగరంలోని ఏడు మండలాల్లో నాలుగు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ అప్‌గ్రేడ్‌కు ఆర్థిక సహాయం చేసేందుకు  బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ(బెస్కామ్) వద్ద ఉన్న నిధుల వినియోగానికి మంత్రివర్గం అధికారాలు ఇచ్చింది. కర్నాటకలోని ఇతర పట్టణ స్థానిక సంస్థల నమూనాను బీబీఎంపీ అనుసరిస్తోంది. ఇవి విద్యుత్తును ఆదా చేసేందుకు సోడియం-వేపర్ వీధిలైట్ల నుంచి ఎల్ఈడీ వీధిలైట్లకు మారాయి. ఎల్‌ఈడీ లైట్ల వల్ల పాత లైట్ల వార్షిక విద్యుత్ వినియోగంలో 50 శాతం వరకు ఆదా అవుతుందని అంచనా. ప్రస్తుతం మహదేవపూర్‌తోపాటు కొన్ని మండలాల్లో బీబీఎంపీ దాదాపు 1.6 లక్షల ఎల్‌ఈడీ వీధిలైట్లను ఏర్పాటు చేసింది. ఏడు జోన్లలో దాదాపు 4.6 లక్షల వీధిలైట్లు ఉన్నాయి. రాబోయే ప్రాజెక్ట్ వీటిలో దాదాపు 3 లక్షల కొత్త ఎల్ఈడీ లైట్లతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Tags:    

Similar News