బాంబుల తయారీ కేంద్రంగా బెంగాల్: టీఎంసీపై ప్రధాని మోడీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. టీఎంసీ రాష్ట్రాన్ని బాంబుల తయారీ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు.

Update: 2024-05-12 07:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. టీఎంసీ రాష్ట్రాన్ని బాంబుల తయారీ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. బరాక్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ‘బెంగాల్‌లో ఒకప్పుడు శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగాయి. కానీ టీఎంసీ పాలనలో రాష్ట్రం మొత్తం బాంబులు ఉత్పత్తి చేసే స్వదేశీ పరిశ్రమగా తయారైంది. టీఎంసీ రక్షణలో అక్రమ వలస దారులు అభివృద్ధి చెందుతున్నారు. అక్రమ వలసదారులపై బెంగాల్ ఉద్యమించే సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు.

బెంగాల్‌లోని టీఎంసీ కాంగ్రెస్, ఇండియా కూటమి బుజ్జగింపు రాజకీయాల ముందు లొంగి పోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు ప్రధాని మోడీ ఐదు హామీలు ఇచ్చారు. ‘నేను ఇక్కడ ఉన్నంత వరకు మత ఆధారిత రిజర్వేషన్లు ఉండవు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరు. రామ నవమి వేడుకలు నిర్వహించకుండా అడ్డుకోలేరు. నవమి పూజతో అయోధ్యలోని రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రద్దు చేయలేరు, సీఏఏ అమలు సైతం అడ్డుకునే సాహసం చేయలేరు’ అని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌ భూమి, ముఖ్యంగా బరాక్‌పూర్‌ చరిత్ర లిఖించిందని కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో బరాక్‌పూర్‌ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కానీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ స్కామ్‌లకు కేంద్రంగా మార్చిందని మండిపడ్డారు. హిందువులను భగీరథ నదిలో ముంచేస్తామని ఒక టీఎంసీ ఎమ్మెల్యే అన్నారు. వారి సాహసోపేతాన్ని ఊహించుకోండి. వారికి ఎవరు మద్దతిస్తున్నారో తెలుసుకోండి అని ప్రజలకు సూచించారు. ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తోందని తెలిపారు. 

Tags:    

Similar News