Badlapur : స్కూల్ టాయిలెట్‌లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగికదాడి

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర‌లోని థానే జిల్లా బద్లాపూర్‌లో దారుణం జరిగింది.

Update: 2024-08-21 14:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర‌లోని థానే జిల్లా బద్లాపూర్‌లో దారుణం జరిగింది. ఓ స్కూల్‌లో ఇద్దరు అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారులపై స్వీపర్ అక్షయ్ షిండే (23) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆగస్టు 13న పాఠశాలలోని టాయిలెట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు బాధిత చిన్నారుల్లో ఒకరు తాను స్కూలుకు ఇక వెళ్లనని ఇంట్లో మారాం చేసింది. ఆమె సవ్యంగా నడవలేకపోయింది. మూత్రం సరిగ్గా రావడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో పేరెంట్స్‌కు అనుమానం వచ్చి ఆరాతీయగా తమపై జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది. ఆ ఇద్దరు చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించగా లైంగిక దాడి జరిగిందని వెల్లడైంది. ఓ చిన్నారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తేలింది. బాధిత పిల్లల పేరెంట్స్ ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆరోజు ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు బాధిత కుటుంబీకులను పోలీసులు దాదాపు 11 గంటల పాటు వెయిట్ చేయించారు. దీనిపైనా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఎఫ్‌ఐఆర్‌‌ను నమోదు చేయడంలో జాప్యంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర పోలీసుశాఖను ఆదేశించింది. ఎట్టకేలకు నిందితుడు అక్షయ్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈనెల 24న మహారాష్ట్ర బంద్‌కు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి పిలుపునిచ్చింది. ఈ కేసుపై వేగవంతమైన దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారిణి ఆర్తిసింగ్‌ ఈ సిట్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఈ కేసులో బాధిత కుటుంబాల తరఫున వాదించేందుకు బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు.

Tags:    

Similar News