కాంగ్రెస్​ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు.

Update: 2024-05-07 17:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య ఆలయానికి బాబ్రీ తాళం వేస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్డీయేకి మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వం ఆర్టికల్ 370కి కూడా తిరిగి తీసుకొస్తుందని హెచ్చరించారు. అందుకే ఎన్డీయేకు 400 సీట్లు కావాలని అడుగుతున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్, ధార్ జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ నిరంతరం అబద్దాలను ప్రచారం చేస్తుందని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం కీలక దశలో ఉందని చెప్పారు.

‘పాకిస్తాన్‌లో, ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా జిహాద్‌ను బెదిరిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రజలను ఏకం చేసి తనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. నిరాశ, నిస్పృహలతో కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఆలోచించండి. ‘ఓటు జిహాద్’ మీకు ఆమోదయోగ్యమేనా? ప్రజాస్వామ్యంలో దీన్ని అనుమతించొచ్చా?’ అని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌లో జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించిన పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ప్రతి దశ ఓటింగ్‌లో పాకిస్తాన్‌పై కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమ తారాస్థాయికి చేరుకుంటోందని తెలిపారు. వారి ప్రకటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. 

Tags:    

Similar News