విదేశీ విద్యార్థులపై దాడి: గుజరాత్ యూనివర్సిటీలో కలకలం
అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. పబ్లిక్ స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. పబ్లిక్ స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అంతేగాక విదేశీ స్టూడెంట్స్ నివాసముండే హాస్టల్ గదిని కూడా ధ్వంసం చేశారు. దుండగులు రాళ్లు రువ్వుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా వారిని ఎస్వీపీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మరిన్ని ఘటనలు చోటుచేసుకోకుండా యూనివర్సిటీలో బలగాలను మోహరించారు. యూనివర్సిటీకి వెళ్లే అన్ని గేట్లను మూసివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడికి గల కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఉజ్బెకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన నలుగురు విద్యార్థులు తమ గదుల్లో నమాజ్ చేసే క్రమంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. హాస్టల్‌పై దాడి చేసే సమయంలో నిందితులు మతపరమైన నినాదాలు చేసినట్టు సమాచారం.
మోడీ, అమిత్ షా జోక్యం చేసుకుంటారా?..అసదుద్దీన్ ఓ వైసీ
అంతర్జాతీయ విద్యార్ధులపై జరిగిన దాడిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఇందులో జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. ఈ దాడిలో వారు జోక్యం చేసుకుంటారా? ముస్లింలపై ద్వేషం పెంచుకోవడం దేశంపై ఉన్న మంచి భావనను నాశనం చేస్తోంది’ అని పేర్కొన్నారు.