ఈసీ.. బీజేపీకి అనుబంధ సంస్థా ? : అతిషి

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి ఫైర్ అయ్యారు.

Update: 2024-04-05 15:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి ఫైర్ అయ్యారు. బీజేపీ ఫిర్యాదు మేరకు తనకు శుక్రవారం రోజు ఈసీ షోకాజ్ నోటీసులను జారీ చేయడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘ఈసీ.. బీజేపీకి అనుబంధ సంస్థా ?’’ అని అతిషి ప్రశ్నించారు. ‘‘ఎన్నికల సంఘం ఈమెయిల్ ద్వారా నాకు షోకాజ్ నోటీసులను పంపడానికి గంట ముందే.. అవి బీజేపీ ద్వారా మీడియాకు లీకయ్యాయి’’ అని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మంత్రి అతిషి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీలో బీజేపీ అభ్యంతరకరమైన హోర్డింగ్‌లు, పోస్టర్లను ఏర్పాటు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అనేకసార్లు ఈసీకి లేఖలు రాసింది. అయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఫిర్యాదుకు మాత్రం ఈసీ వెంటనే స్పందించింది’’ అని ఆమె విమర్శించారు. బీజేపీకి అనుబంధ సంస్థ అన్నట్టుగా ఈసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తగిన సమాధానం ఇస్తాను 

‘‘ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌ను ఈడీ అరెస్టు చేయడంపై.. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేయడంపై ఈసీ ఎందుకు స్పందించలేదు. ఆయా కేంద్ర సంస్థలకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదు’’ అని అతిషి ప్రశ్నించారు. ‘‘ఈసీ పంపిన నోటీసులకు నేను తగిన సమాధానం ఇస్తాను. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో తటస్థత, పక్షపాతరహిత వైఖరికి ఉన్న ప్రాధాన్యతను ఎన్నికల కమిషన్‌కు గుర్తుచేస్తాను’’ అని ఆమె చెప్పారు.కాగా, ‘‘పార్టీలో చేరకుంటే నెల రోజుల్లోగా ఈడీతో అరెస్టు చేయిస్తామని నాకు బీజేపీ వార్నింగ్ ఇచ్చింది’’ అని అతిషి చేసిన ఆరోపణలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయగా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది.

Tags:    

Similar News