Swathi Maliwal : అతిశీ ఒక డమ్మీ సీఎం.. ఢిల్లీని ఇక ఆ దేవుడే రక్షించాలి
ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకముందే ఢిల్లీ తదుపరి సీఎంగా ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిశీ ఎంపికైన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో : ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకముందే ఢిల్లీ తదుపరి సీఎంగా ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిశీ ఎంపికైన విషయం తెలిసిందే. ఆమె పేరును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. పార్టీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు మంగళవారం ఆప్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం ఢిల్లీకి కాబోయే తదుపరి సీఎం అతిశీ అని ఎల్జీకి పరిచయం చేశారు. అయితే, పార్టీ నిర్ణయంపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆతిశీ ఒక ‘డమ్మీ సీఎం’ అంటూ ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘ఢిల్లీకి ఇది నిజంగా విచారకరమైన రోజు. గతంలో ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడేందుకు యత్నించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి సీఎం పగ్గాలు అప్పగించారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడినప్పుడు.. అతన్ని రక్షించేందుకు ఆతిశీ ఫ్యామిలీ సుదీర్ఘకాలం పోరాడింది. తను అమాయకుడని, రాజకీయ కుట్రకు బలయ్యాడని.. అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని నాటి రాష్ట్రపతికి అతిశీ తల్లి లేఖను సైతం రాశారు. ఇప్పుడు ఆతిశీ ‘డమ్మీ సీఎం’ అయినప్పటికీ ఆమె ఎంపిక .. దేశ భద్రతకు ఆందోళన కలిగించే అంశం. ఇక ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’ అని స్వాతి మాలీవాల్ రాసుకొచ్చారు. కాగా, మాలీవాల్ వ్యాఖ్యలపై ఆప్ నేత దిలీప్ పాండే మండిపడ్డారు. ఆమె పార్టీని వీడాలని డిమాండ్ చేశారు. ‘ఆప్ సభ్యురాలిగా ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ, ఇప్పుడు బీజేపీకి వంతపాడుతున్నారు. ఆతిశీ ఎంపిక నిర్ణయం ఆమెకు నచ్చకపోతే రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేయాలి’ అని పాండే విమర్శించారు.
ఇదిలాఉండగా, రాజ్యసభ ఎంపీ అయిన స్వాతి మాలీవాల్‌ను గతంలో కేజ్రీవాల్ పర్సనల్ సెక్యూరిటీ తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ విషయం కేజ్రీవాల్‌కు తెలిసే జరిగిందని, దాడికి సంబంధించిన దృశ్యాలను సీసీ ఫుటేజీ నుంచి తొలగించారని ఆమె ప్రధానంగా ఆరోపించింది.