యూపీలో మజ్లిస్ పార్టీకి తోడు దొరికింది!
దిశ, నేషనల్ బ్యూరో : అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని మజ్లిస్ పార్టీకి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో ఒక మిత్రపక్షం దొరికింది.
దిశ, నేషనల్ బ్యూరో : అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని మజ్లిస్ పార్టీకి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో ఒక మిత్రపక్షం దొరికింది. యూపీలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ (కమేరావాది)తో కలిసి మజ్లిస్ పోటీ చేయనుంది. ‘పిచ్డా, దళిత్ ఔర్ ముసల్మాన్’ (పీడీఎం) పేరుతో ఏర్పాటైన ఈ కూటమికి అప్నా దళ్ అగ్ర నాయకురాలు పల్లవి పటేల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సారథ్యం వహించనున్నారు. ప్రేమ్‌చంద్ బింద్‌కు చెందిన ప్రగతిశీల మానవ్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీలు కూడా ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంతకుముందు సమాజ్ వాదీ పార్టీతో అప్నా దళ్‌కు పొత్తు ఉండేది. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్ చీఫ్ పల్లవి పటేల్ సమాజ్ వాదీ పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా.. ఒక దళిత అభ్యర్థికి మాత్రమే పల్లవి పటేల్ ఓటు వేశారు. మిగతా ఇద్దరికి ఓటు వేసేందుకు ఆమె నిరాకరించారు. దీంతో అప్నాదళ్, సమాజ్ వాదీ పార్టీల మధ్యనున్న పొత్తుకు విఘాతం కలిగింది.