Article 370: ఆర్టికల్ 370 పునరుద్ధరించాలి.. ప్రతిపాదనకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదం
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్దరించే ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 (Article 370)ని పునరుద్దరించే ప్రతిపాదనకు కశ్మీర్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి(surinder Chowdary) 2019లో కేంద్రం రద్దు చేసిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అంశంపై కశ్మీర్ ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఐక్యత, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 పునరుద్దరణకు కృషి చేయాలని కోరారు. ఈ తీర్మానానికి నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(PDP), ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అనంతరం ఎలాంటి చర్చ లేకుండానే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్టు స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ప్రకటించారు.
అభ్యంతరం తెలిపిన బీజేపీ
బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకించారు. బిల్లును ఏకపక్షంగా ఆమోదించడంపై నిరసన తెలిపారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. స్పీకర్ కేబినెట్ సమావేశాన్ని పిలిచి తీర్మానం ముసాయిదాను స్వయంగా తయారు చేశారని ఆరోపించారు. జమ్మూలోని మరికొందరు నేతలు నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా, 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.