డీజేబీ కేసులోనూ ఈడీ విచారణకు డుమ్మా: కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం

ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ)లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లను తిరస్కరించారు.

Update: 2024-03-18 05:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ)లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లను తిరస్కరించారు. డీజేబీ కేసులో సోమవారం ఆయన విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. అయితే కేజ్రీవాల్ విచారణకు వెళ్లడం లేదని ఆప్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవని పేర్కొంది. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్‌ మంజూరైనప్పటికీ.. మళ్లీ మళ్లీ సమన్లు ​​ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించింది.

కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ అరవింద్ కేజ్రీవాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో ఈడీ పంపిన ఎనిమిది సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉండగానే మార్చి 17న (ఆదివారం) మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఈసారైనా కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే కేజ్రీవాల్‌కు ఈడీ వరుస సమన్లు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Tags:    

Similar News