Amith shah: బీజేపీ వస్తే జార్ఖండ్‌లో చొరబాటుదారులను గుర్తిస్తాం.. కేంద్ర మంత్రి అమిత్ షా
జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని చొరబాటుదారులను గుర్తిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని చొరబాటుదారులను (infiltrators) గుర్తిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) హామీ ఇచ్చారు. అంతేగాక వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని నొక్కి చెప్పారు. సెరైకెలాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. చొరబాటు దారులు భూమిని అక్రమంగా లాక్కోవడానికి గిరిజన మహిళలను పెళ్లిచేసుకుంటున్నారని, అలాంటి వారికి భూమి బదలాయింపును నిలిపివేసేలా చట్టం తీసుకొస్తామన్నారు. కబ్జాకు గురైన భూమిని గిరిజనులకు తిరిగి ఇస్తామని చెప్పారు. జార్ఖండ్ లో గిరిజన జనాభా భారీగా తగ్గుతోందని ఆరోపించారు.
చొరబాట్ల అంశాన్ని లేవనెత్తినందుకే చంపయీ సోరెన్ (Champai soren) సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), కాంగ్రెస్ (Congress), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేతలు తమ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని, భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరినీ జైలుకు పంపిస్తామన్నారు. భూ కుంభకోణం, లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్ ల వెనుక జేఎంఎం హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు గర్వాలోని భవన్‌పూర్‌లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. చొరబాట్లను జేఎంఎం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని సహజ సంపదను జేఎంఎం ప్రభుత్వం దోచుకుందని తెలిపారు.