Amith shah: సరిహద్దు భద్రతకు హైటెక్ నిఘా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరించనున్నట్టు అమిత్ షా వెల్లడించారు.

Update: 2025-04-07 16:10 GMT
Amith shah: సరిహద్దు భద్రతకు హైటెక్ నిఘా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు, చొరబాట్లను ఆపడానికి నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరించనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) వెల్లడించారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కథువా జిల్లాలోని హీరా నగర్ సెక్టార్‌లో ఉన్న ఔట్ పోస్ట్ ‘వినయ్’ను సందర్శించి బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకంగా ఉంటుందని నొక్కి చెప్పారు. కొత్త నిఘా వ్యవస్థలు సరిహద్దు బయట నుంచి వచ్చే శత్రు చర్యలకు త్వరగా స్పందించేలా భారతదేశ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయన్నారు. ‘భద్రతను మరింత పకడ్భందీగా నిర్వహించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించి రెండు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను రూపొందించాం. వాటిని ఏర్పాటు చేశాక శత్రువు వైపు నుంచి ఎటువంటి దుశ్చర్యలు ఎదురైనా తక్షణమే ప్రతిస్పందించడం వీలవుతుంది’ అని తెలిపారు.

రాబోయే మూడు, నాలుగేళ్లలో పాకిస్తాన్‌తో ఉన్న మొత్తం సరిహద్దు ఈ ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా కవర్ చేయబడుతుందని, దీనిని బంగ్లాదేశ్ సరిహద్దు వరకు కూడా విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త నిఘా మౌలిక సదుపాయాల్లో భూగర్భ సొరంగాలను గుర్తించి వాటిని కూల్చివేయడానికి రూపొందించిన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉందన్నారు. వీటిని ఉపయోగించి ఇప్పటికే అనేక సొరంగాలను గుర్తించామని తెలిపారు. తన పర్యటనలో భాగంగా అమిత్ షా ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నిమాయకాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు.

Tags:    

Similar News