Akhilesh yadav: జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

తమ పార్టీ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు.

Update: 2024-09-14 14:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమ పార్టీ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీగా అవతరించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెపారు. అంతేగాక ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం కూడా పోటీ చేయడానికి మరో కారణమన్నారు. నేషనల్ పార్టీగా మారడానికి చిన్న రాష్ట్రాలే దోహదం చేయగలవని అభిప్రాయపడ్డారు. హిందీ దివస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ భాషలను ప్రోత్సహించాలని సూచించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. మంగేష్ యాదవ్ ఎన్‌కౌంటర్‌ పై కుట్రలో పోలీస్ శాఖ మొత్తం బిజీగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎస్పీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కలిసి పోటీ చేస్తోంది. కాగా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఈ నెల 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించాయి.  


Similar News