Akhilesh Yadav: సంభాల్ అల్లర్లపై లోక్ సభలో అఖిలేష్ కీలక కామెంట్స్
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ హింసపై (Sambhal violence) పార్లమెంట్ సమావేశాల్లో సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ హింసపై (Sambhal violence) పార్లమెంట్ సమావేశాల్లో సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. జీరోఅవర్‌లో అఖిలేశ్ యాదవ్ సంభాల్ అంశాన్ని లేవనెత్తారు. సంభాల్ లో హింస చెలరేగడంతో బీజేపీ ప్రమేయం ఉందని పరోక్షంగా ఆరోపించారు. ‘‘సంభాల్‌లో ఘర్షణలు సృష్టించేందుకు పక్కా ప్లాన్ తో కుట్ర చేశారు’’ అని అఖిలేష్ అన్నారు. యూపీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకల నుంచి దృష్టిని మళ్లించేందుకు కుట్ర చేసి.. ఆ తర్వాత అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘సర్కిల్ అధికారి ప్రజలను నానా మాటలు అన్నారు. వారిపై కాల్పులు జరిపారు. ఐదుగురు అమాయకులు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలి. ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి. బాధితులకు న్యాయం జరగాలి’’ అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల మధ్య ఆధిపత్య పోరు నెలకొందంటూ అఖిలేశ్ ఆరోపించారు. ‘‘లక్నో, ఢిల్లీ మధ్య పోరు జరుగుతోంది. కేంద్రంలో అధికారం సాధించిన విధానాన్ని లక్నోలో పాటిస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
అఖిలేష్ వ్యాఖ్యలపై నిరసన
అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో లోక్ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ఎన్డీయే ఎంపీలు ఖండించారు. నిరసన వ్యక్తంచేశారు. ఇకపోతే, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ లో ఉన్న షాహీ ఈద్గా మసీదు వద్ద గతంలో హరిహర హిందూ దేవుళ్ల ఆలయం ఉన్నట్లు వేసిన పిటిషన్ ఆధారంగా సర్వే చేపట్టేందుకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కొన్నిరోజుల క్రితం సంభాల్ లో హింస చెలరేగింది. స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసలో ఐదుగురు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ షాహీ ఈద్గా మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.