సంపన్న ఉప కులాలను రిజర్వేషన్ల నుంచి ఎందుకు తొలగించకూడదు?.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Update: 2024-02-06 19:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వెనుకబడిన తరగతులలో సంపన్నమైన ఉపకులాలను రిజర్వేషన్‌ జాబితా నుంచి మినహాయించి సాధారణ వర్గంతో పోటీపడేలా ఎందుకు చేయకూడదని ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ప్రశ్నించింది. “వెనుకబడిన తరగతులలో సంపన్నమైన ఉప కులాలను రిజర్వేషన్ జాబితా నుండి ఎందుకు మినహాయింపు ఉండకూడదు? ఇందులో కొన్ని ఉపకులాలు ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నాయి. వారు రిజర్వేషన్ల నుండి బయటకు వచ్చి జనరల్ కేటగిరీతో పోటీ పడాలి. ఇంకా అక్కడే ఎందుకు ఉండాలి?’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రశ్నించారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గంలోని సమూహాలను రాష్ట్రాలు గుర్తించి ఉప వర్గీకరించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగానే జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల్లోని సంపన్నమైన ఉపకులాలు రిజర్వేషన్ల డొమైన్ల నుంచి వైదొలిగి, ఇప్పటికీ అట్టడుగున ఉన్న ఉప కులాలకు చోటు కల్పించాలని అన్నారు.

‘తర తరాలుగా రిజర్వేషన్ ప్రయోజనాలు’

‘ఒక వ్యక్తి ఐపీఎస్ లేదా ఐఏఎస్‌ అయిన తర్వాత, అతని పిల్లలు గ్రామంలోని తోటి పిల్లల నుంచి వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉండదు. అయినప్పటికీ అతని కుటుంబం తరతరాలుగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతుంది’’ అని ధర్మాసనంలోని మరో జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. కోటా జాబితా నుండి ఆ ఉన్నతమైన ఉప కులాన్ని మినహాయించాలా వద్దా అనేది పార్లమెంటే నిర్ణయించాలని అన్నారు.



Tags:    

Similar News