టీఎంసీ కంటే బీజేపీకి ఓటేయడమే బెటర్.. కాంగ్రెస్ అభ్యర్థి సంచలన కామెంట్స్
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కంటే మోడీకి చెందిన బీజేపీకి ఓటు వేయడమే మంచిదని ఆయన కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో అధిర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు గెలవడం అవసరం. ఒకవేళ అది జరగకపోతే దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడుతుంది. టీఎంసీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. అందుకే టీఎంసీకి ఓటేయాలని అనుకునేవారు నేరుగా బీజేపీకి ఓటేయడమే మంచిది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అధిర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి టీఎంసీ అభ్యర్థిగా యూసుఫ్ పఠాన్ బరిలోకి దిగారు.
అధిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. తాను ఇంకా ఆ వీడియోను చూడలేదన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు అధిర్ అలా మాట్లాడి ఉండరు. టీఎంసీని ఓడించాలనే ఉద్దేశంతో అలా చెప్పి ఉంటారు. యావత్ దేశంలో బీజేపీని ఓడించడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. అధిర్ కామెంట్లపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ‘‘బెంగాల్‌లో ఇన్నాళ్లూ బీజేపీకి కళ్ళు చెవులుగా అధిర్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన బీజేపీకి బీ టీమ్ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. అందుకే బీజేపీకి ఓటు వేయమని బహిరంగంగా ప్రజలను కోరుతున్నారు’’ అని టీఎంసీ ఓ ట్వీట్ చేసింది.