ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం… సోదరులుగా భావించాలని చెప్పి యువకులు చేసిన పనికి యువతి షాక్
సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాకా అంతే స్థాయిలో మోసాలు పెరిగిపోతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాకా అంతే స్థాయిలో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇన్ స్టాలో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని నిండా ముంచారు. తాము నీకు సోదరుల లాంటి వారిమని నమ్మించి రూ.2 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. తీరా తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లక్నో లోని ఇందిరానగర్ కు చెందిన ఓ యువతికి ఇన్ స్టా గ్రామ్ లో రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఈ ముగ్గురు సదరు యువతితో పరిచయం పెంచుకుని తమను సోదరులుగా భావించాలని చెప్పి ఆమె నమ్మకాన్ని పొందారు. ఇలా చాలా కాలం పాటు ఆన్ లైన్ ద్వారా మాట్లాడుకుంటుండగా ఇటీవలో మీ పెళ్లి కోసం ఖరీదైన బహుమతి పంపిస్తామని చెప్పి షిప్పింగ్ అవసరాల కోసం ఆధార్ కార్డు, ఫోటో, ఇతర డాక్యుమెంట్స్ తీసుకున్నారు.
ఆ తర్వాత విమానాశ్రయంలో బహుమతి సీజ్ చేశారని ఆ ప్యాకేజీని విడుదల చేయడానికి కొంత డబ్బు చెల్లించాలని మనోజ్ ఫోన్ చేయగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి ఆమెను వారు బెదిరించడం ప్రారంభించారు. మేము చెప్పినట్లుగా చేయకుంటే సీబీఐ, క్రైమ్ బ్రాంచ్, ఇన్ కమ్ ట్యాక్స్ ద్వారా అరెస్ట్ చేయిస్తామని బెదిరించారు. వారి హెచ్చరికలకు భయపడిపోయిన సదరు యువతి చివరకు వారు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా రూ.1.94 లక్షలు వారికి బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిజిత్ శంకర్ తెలిపారు.