భారత్‌లోనే అత్యధిక విమాన రేట్లు
ప్రపంచవ్యాప్తంగా దేశీయ విమాన టికెట్ల ధరలలో భారత్‌లోనే అత్యధికంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడిచింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా దేశీయ విమాన టికెట్ల ధరలలో భారత్‌లోనే అత్యధికంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడిచింది. వివిధ దేశాల్లో దేశీయ విమాన టిక్కెట్ల ధరలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ ఓ అధ్యయనం జరిపింది. దీనికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. ఇందులో విమాన టికెట్ ధరలు భారత్‌లోనే అత్యధికంగా 41 శాతం పెరిగినట్లు తేలింది. ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ 34 శాతం, సింగపూర్ 30 శాతం, ఆస్ట్రేలియా 23 శాతంగా ఉన్నాయి. భారత్‌తో సహా ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, జపాన్‌లోనూ ఈ ఏడాదిలో ఇదే విధమైన ధరలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అత్యంత బిజీగా ఉండే రూట్లైన సావో పాలో-రియో డి జనీరో మధ్య అత్యధికంగా రూ. 26,800, లండన్-ఈడెన్‌బర్గ్‌కు రూ. 6800, లాస్ ఏంజెల్స్-లాస్ వెగాస్ మధ్య ప్రయాణ టికెట్ ధర రూ. 5500 మాత్రమేనని నివేదిక వెల్లడించింది.
కానీ, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ టికెట్ ధర మాత్రం రూ.14 వేలుగా ఉంటోందని.. ఇది అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటని పేర్కొంది. ఇలా విమాన టికెట్ ధరలు భారీగా పెరగడానికి ఇంధన ధరలు, ద్రవ్యోల్బణమే కారణమని నివేదికలో వెల్లడిచింది. కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ రంగానికి అధిక టికెట్ ధరలు ముప్పుగా మారాయని తాజా నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఇలా గణనీయంగా పెరుగుతోన్న విమాన టికెట్ ధరలపై ఇటీవల భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ గ్రూపుతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన విమాన టికెట్ ధరల్లో స్వీయ నియంత్రణ పాటించాలని, పౌరులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు.