ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు ఎండల ప్రభావం
ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలంతా కూడా ఎండల వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలంతా కూడా ఎండల వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు మరో నాలుగు-ఐదు రోజులు కొనసాగేలా ఉన్నాయి. వాతావరణ శాఖ పేర్కొన్న దాని ప్రకారం, జూన్ 16 నుండి జూన్ 18 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో తీవ్రమైన ఎండల ప్రభావం ఉంటుందని అంచనా. దీంతో ఐఎండీ ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మరింత తీవ్రమైన ఎండలు ఉంటాయిని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మెల్లగా దేశమంతా విస్తరించడానికి చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే 4-5 రోజులలో బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్ & వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. .
రాబోయే మూడు-నాలుగు రోజుల్లో సిక్కిం, అస్సాం, మేఘాలయలో భారీ నుండి అతి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంగా నది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలలో కూడా రాబోయే నాలుగు రోజుల్లో "చెదురుమదురుగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు" కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల కారణంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు జూన్ 18 తర్వాత వేడిగాలుల నుండి ఉపశమనం పొందవచ్చని ఐఎండీ తెలిపింది.