న్యూఢిల్లీ : ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర.. ఎంతో చారిత్రక ఘనత కలిగినది. ఇది అష్టభుజి ఆకారంలో ఉంటుంది. అచ్చం అదే తరహా డిజైన్‌ను ఇప్పుడు ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ స్థాయి సైనిక ఉన్నతాధికారుల భుజాలపై ధరించే బ్యాడ్జీలపై ముద్రించారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితోనే ఈ మార్పు చేశామని భారత నౌకాదళం ప్రకటించింది. రియర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, అడ్మిరల్ స్థాయి అధికారుల బ్యాడ్జీలలో ఈమేరకు మార్పులు జరిగాయని తెలిపింది. వాటికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా శుక్రవారం విడుదల చేసింది.
వాస్తవానికి ఈ మార్పుపై డిసెంబరు 4నే ఇండియన్ నేవీ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేశారు. బ్రిటీష్ కాలంలో నేవీ అడ్మిరల్స్ బ్యాడ్జీలపై ముద్రించిన చిహ్నాలు బానిస మనస్తత్వానికి చిహ్నాలని.. అందుకే వాటిని తొలగించామని ఆసందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. సైనిక అధికారుల హోదాల పేర్లతో పాటు వారు ధరించే యూనిఫామ్‌లపై ఉండే చిహ్నాలలోనూ భారతీయత ప్రతిబింబించేలా తాము నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.